మన పతాక ప్రస్థానం
ఒక జాతి లేదా దేశం యొక్క అస్తిత్వానికి చిహ్నం ' జెండా '
భారత జాతి ప్రపంచంలో గర్వంగా చెప్పుకునే చిహ్నం మన మువ్వన్నెల జెండా
ఈ జెండా రూపకల్పనా ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిద్దాం...........
* తొలిసారిగా 1904 లో భారత జాతికి ఒక ప్రత్యేకమైన చిహ్నం ఉండాలనే ఉద్దేశ్యంతో సిస్టర్ నివేదిత ఒక పతాకాన్ని రూపొందించారు. మొదట ఆది ఎరుపు, నలుపు రంగుల్లో ఉండేది. అయితే తర్వాత ఆమె తన విద్యార్థుల సలహాతో కాషాయం, పసుపు రంగుల్లోకి మార్చారు. 1906 లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో ఈ జెండా ఎగురవేశారు.
* 1905 లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ను విభజించింది. ఆ విభజనను వ్యతిరేకిస్తూ పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్ కే చెందిన సచ్చీంద్రప్రసాద్ బోస్, సుకుమార్ లు మొదటిసారి త్రివర్ణ పతాకం రూపొందించారు. హిందూ ముస్లిం సమైక్యతను ప్రతిఫలించే విధంగా ఆ జెండా రూపుదిద్దుకుంది.
* తర్వాత కొన్నాళ్ళకి హోం రూల్ ఉద్యమం ప్రారంభమైంది. దానికి అనీబిసెంట్, బాలగంగాధర తిలక్ లు నాయకత్వం వహించారు. అప్పుడు ఐదు రంగులతో మరో జెండా రూపుదిద్దుకుంది.
* మహాత్మాగాంధీ ప్రభావానికి ఉత్తేజితుడైన పింగళి వెంకయ్య గారు మొదట ఒక జెండా నమూనా తయారుచేసారు. తర్వాత దానికి మధ్యలో చరఖాను కలిపారు. అయితే కాంగ్రెస్ కమిటీ ఈ నమూనా నచ్చలేదు.
అప్పుడు గాంధీగారి సలహాతో వెంకయ్య గారు తయారు చేసిన మరో జెండా అందరి ఆమోదం పొంది 1921 లో అహమ్మదాబాద్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఎగిరింది. ఆ జెండా దేశమంతా స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించింది. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో చరఖాతో ఆ జెండా ఉండేది....
* తెలుగు తేజం పింగళి వెంకయ్య గారు రూపొందించిన ఆ మువ్వన్నెల జెండా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ చిహ్నంగా గుర్తించబడి కొన్ని మార్పులతో ఆమోదించబడింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో బాటు మధ్యలో చరఖా బదులుగా అశోక చక్రం ఉంచబడింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రపంచ పటంలో భారతదేశ పతాకం రెపరెపలాడుతోంది...
సేకరణ - సాయి నాథ్ రెడ్డి
0 comments:
Post a Comment
Follow us @ www.facebook.com/YuvaNirmaan