నేడు సంఘ సేవలు అందించే సంస్ధల సంఖ్య పెరుగుతుంది. ఇది సంతోషించాల్సిన విషయం అయినప్పటికీ సేవాసంస్ధలకు సహాయ సహకారాలను అందించడానికి జనం జంకుతున్నారు. కారణం సంఘ సేవకుల మీద అపనమ్మకం. వారు నిజంగా నిస్వార్ధ సేవలు అందిస్తున్నారా? అన్న సందేహం!
ఈనాడు కొన్ని స్వచ్ఛంద సంస్ధలు మాత్రమే కాకుండా అనేక సంప్రదాయాలకు చెందిన సన్న్యాసిని సన్యాసులు కూడా సంఘసేవలు అందిస్తున్నారు. ఈ మధ్య ఒక పెద్ద మనిషి ఆయన ఆందోళనను ఇలా వ్యక్తం చేసాడు. “స్వామీజీ! సిద్ధార్ధుడు ఒక రాజకుమారుడు. ఆయన వైరాగ్యంతో రాజభవంతి విడిచి పెట్టి, సత్యాన్వేషణకు అడవులకు వెళ్ళాడు. మరి ఇప్పుడు సంఘ సేవకులమంటూ బరిలోకి దిగిన సాధారణ సగటు మనుషులు కూడా కొద్ది రోజులలోనే రాజభవంతులను మైమరిపించే కట్టడాలకు యజమానులవుతున్నారు. ఇదేం చోద్యం!”.
ఇది ఇలా ఉండగా సేవాసంస్ధల మధ్య పోటీ పెరుగుతుంది. ‘ మేము గొప్ప’ అంటే ‘మేము గొప్ప’ అని పెద్ద మొత్తాలు ఖర్చుపెట్టి పెద్దయెత్తున పనులు చేయడానికి ఆశ పడుతున్నారు. దీనికి చాలా ధనం కావలసి ఉంటుంది. ఆ ‘డబ్బు-మబ్బు’లో పడి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా ఉంది నేటి సమాజంలోని పరిస్ధితి.
దీనికి పరిష్కారం, స్వామి వివేకానంద మాటల్లో : “సంఘంలో ఎంతమంది మనుషులున్నారు? అనేది ముఖ్యం కాదు. తమ ఆలోచనల్ని, మాటల్ని, చేతల్ని ఒకటిగా చేసుకున్న నలుగురు కలిస్తే చాలు ఈ ప్రపంచాన్ని తలక్రిందులు చేయవచ్చు. సేవా కార్యక్రమాలను హృదయపూర్వకంగా ఆత్మార్పణ బుద్దితో చేయండి. అదే నిజమైన సేవ. అప్పుడే ప్రజలకు మీ మీద నమ్మకం బలపడుతుంది.”
సంఘ సేవకులు సంఘ మిత్రులవ్వాలి. సంఘానికి అవసరమైన సేవలను అందించాలి. సంఘం అంటే ‘వసుధైక కుటుంబకం’ అని మరచిపోకూడదు.
భారత్ మాతాకి జై.
జై హింద్.
- స్వామి సుప్రియానంద (రామకృష్ణ మిషన్).
2014 జూలై రామకృష్ణ ప్రభ సంచిక నుంచి ఇక్కడ ప్రచురించడం జరిగినది.
సంఘం శరణం గచ్చామి!
ReplyDelete